Translate

Wednesday, 8 October 2014

రంగులీనిన రక్తచంద్రబింబం !



వాషింగ్టన్, అక్టోబర్ 8: వినువీధిలో అద్భుత దృశ్యం దర్శనమిచ్చింది. రాగి ఎరుపు రంగులద్దుకొని జాబిలి రక్తచంద్రబింబంగా సరికొత్తరూపులో కనిపించింది. బుధవారం తెల్లవారుజామున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడంతో ఇటు అమెరికా, అటు ఆసియాలోని అంతరిక్ష వీక్షకులను ఈ అద్భుత దృశ్యం అలరించింది. చంద్రగ్రహణం సందర్భంగా భూమి నీడ నుంచి ప్రకాశవంతమైన కాంతి జాబిలిపై పడటంతో అది పూర్తిగా రాగి రంగును పులుముకుంది.

moonదీంతో ఎర్రని ఛాయ చంద్రుడిని ఆవరించి.. అది రక్తవర్ణంలో దర్శనమిచ్చింది. అమెరికా తూర్పు తీర ప్రాంతంలో ఉదయం నాలుగు గంటలకు చంద్రగ్రహణం మొదటి దశ ప్రారంభమైంది. దాదాపు గంటపాటు నల్లని నీడ చంద్రుడిని మెల్లగా ఆవరిస్తూ.. పూర్తిగా కమ్మేసింది. భూమి నీడ పూర్తిగా చంద్రుడిని కమ్మేయడంతో ఒక ఎర్రని ఛాయ జాబిలిపై పడింది. గంటపాటు ఈ దృశ్యం అలరించింది. ఆ తర్వాత నెమ్మదిగా చంద్రుడు తిరిగి తన పూర్వపు రంగులోకి మారిపోయాడు. ఎక్లిప్స్ టెలిస్కోప్ ద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకేవరుసలోకి రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వివరాలతో, ఆసక్తికరమైన ప్రశ్నలతో నాసా ట్వీట్స్ చేస్తూ అంతరిక్ష వీక్షకులను అలరించింది. భారత్‌లోని అసోం, త్రిపురతోపాటు పలు నగరాల్లో ఈ అంతరిక్ష దృశ్యం కనిపించింది. చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ఉత్సాహం కనబర్చారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యూరప్, ఆఫ్రికా దేశాల వాసులు మాత్రం ఈ అద్భుత దృశ్యాన్ని చూడలేకపోయారు.

No comments:

Post a Comment